అనన్య న్యూస్: తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం కానుంది.
Ugadhi 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. అంటే దీనర్థం క్రోధమును కలిగించేది. ఈ కాలంలో ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగడం, దేశంలో, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధములు కలగడం, దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం గురించి, ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శాస్త్రాల ప్రకారం ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్షుకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణాల మధ్య సంయుతం యుగం(ఏడాది)కాగా, ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత బుుతువు ప్రారంభమవుతుంది.
పురాణాల ప్రకారం, ఛైత్ర మాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. ఛైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది పండుగ వేళ శిశిర బుుతువుకు వీడ్కోలు పలికి.. వసంత బుుతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి. కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగు వారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు. ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.
ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి, చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో చెరకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు. అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు.