అనన్య న్యూస్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 278కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొంకణ్ రైల్వే పరిధిలో 100 శాతం విద్యుదీకరణ పూర్తైందని రెండు నెలల క్రితం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలో డంబ్లింగ్, ట్రంబ్లింగ్ పెద్ద ఎత్తున కొనసాగడమే కాకుండా సిగ్నలింగ్ వ్యవస్థ, సాంకేతికత చాలా పెరిగిందని స్వయంగా కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంతలోనే ఇంత పెద్ద ప్రమాదం జరగడం శోచనీయం.
ఏయే రైళ్లు ఢీకొన్నాయి? ఎక్కడ ఢీకొన్నాయి?
ప్రమాదంలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సహా మరో గూడ్స్ రైలు ఉన్నాయి. ఇందులో మొదట కోరమాండల్ రైలు పట్టాలు తప్పగా మిగిలిన రెండు రైళ్లు ఆ రైలును ఢీకొట్టాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుండి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కోల్‌కతాకు దక్షిణాన 250 కిలోమీటర్లు, భువనేశ్వర్‌కు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలో బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది.
ప్రమాదం ఎలా జరిగింది?
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ చేరుకుంది. సుమారు రాత్రి 7:20 గంటలకు బాలేశ్వర్ సమీపంలో రైలు 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పి ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అనంతరం, డౌన్‌లైన్‌లో ప్రయాణిస్తున్న 12864 బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, పట్టాలు తప్పిన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లను ఢీకొట్టింది. దీంతో కోరమాండల్ రైలుకు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. అప్పటికే రెండు రైళ్లు ప్రమాదంలో ఉండగా.. పక్కనున్న ట్రాక్ మీద నుంచి దూసుకువచ్చిన గూడ్స్ రైలు ఒకటి ట్రాక్ మీద ఉన్న కోరమాండల్ కోచ్‌లను ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైలు సైతం ఢీకొట్టడంతో మరింత తీవ్రత పెరిగింది. కొరమాండల్ రైలు కోల్‌కతాలోని షాలిమర్ నుంచి చైన్నై వెళ్తోంది. బెంగళూరు నుంచి హౌరాకు సూపర్‌ఫాస్ట్ రైలు వెళ్తోంది. గూడ్స్ రైలు వెళ్లే మార్గం ఇంకా వెల్లడి కాలేదు.
సహాయక చర్యలు:
పట్టాలు తప్పిన కోచ్‌లలో మృతదేహాలు ఏవీ లేవని, అయితే రైళ్ల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రాత్రిపూట సహాయక చర్యలు కొనసాగుతాయని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ సుధాన్షు సారంగి తెలిపారు. ఇక సహాయక చర్యల కోసం 200 అంబులెన్సులు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లు ప్రమాద స్థలానికి పంపినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం 1,200 మంది సిబ్బందితో కూడిన బృందం సహాయక చర్యల్లో ఉందట. క్షతగాత్రులను బాలాసోర్‌లోని ఆసుపత్రి, కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలిస్తున్నారు. అనేక మంది వ్యక్తులు పట్టాలు తప్పిన కోచ్‌ల కింద చిక్కుకుపోయారు. స్థానికులు వారిని రక్షించడానికి అత్యవసర సేవల సిబ్బందికి సహాయం చేస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన మూడు యూనిట్లు, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన నలుగురు, 22 మంది ఫైర్ సర్వీసెస్ సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయక చర్యల కోసం మోహరించారు. రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవ విభాగాల నుంచి అదనపు బృందాలు, పోలీసులతో పాటు భారత వైమానిక దళం నుంచి అదనపు బృందాలను కూడా పంపించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఆయన.. సహాయక చర్యల్ని దగ్గరుండి చేయిస్తున్నారు.
పరిహారం:
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయలు ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయల అందజేయనున్నట్లు తెలిపారు. అదనంగా, ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి సైతం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 50,000 ఇవ్వనున్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు:
ఈ ప్రమాదానికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది. 06782-262286 అనే నంబరు ద్వారా హెల్ప్‌లైన్ తీసుకోవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్‌లు 033-26382217 (హౌరా), 8972073925 (ఖరగ్‌పూర్), 8249591559 (బాలాసోర్) 044- 25330952 (చెన్నై). ఆంధప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు విజయవాడ-0866 2576924, రాజమండ్రి – 08832420541, సామర్లకోట-7780741268, నెట్టూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడూరు-08624250795, ఏలూరు-08812232267..