అనన్య న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 8వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయినట్లు పీఎంఓ వర్గాలు తెలిపినట్లు సమాచారం. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ ప్లాంట్‌కు శంకుస్థాపన, గీసుకొండ మండలం శాయంపేట హవేలీలోని టెక్స్ టైల్ పార్క్ ను ప్రారంభించనున్నారు.
ఇప్పటికే రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులు కాజీపేటలో పర్యటించి మోడీ రాక సందర్భంగా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదిలాఉండగా ప్రధాని మోడీ రాక సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.