- ఘనంగా పాలెం పూర్వ విద్యార్థుల వజ్రోత్సవం..
అనన్య న్యూస్, పాలెం (బిజినేపల్లి): పాలెం పూర్వ విద్యార్థులు సుబ్బయ్య ఆశయాలను కొనసాగించాలని, పాలెం గ్రామాన్ని విద్యా నిలయంగా మార్చిన తోటపల్లి సుబ్బయ్య వ్యక్తి కాదని ఓ అసాధారణ శక్తి అని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పాలెం విద్యా సంస్థల వజ్రోత్సవాలను పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాలలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కార్యదర్శి మనీష్ జోషి, పియు ఉపకులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, సుబ్బయ్య కూతురు సుచిత్ర లు పాల్గొని ప్రసంగించారు. సావనీరును ఆవిష్కరించారు
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాలుగో తరగతి వరకే చదువుకున్న సుబ్బయ్య విద్యా ప్రాధాన్యతను గుర్తించి పాలెంలో విద్యాసంస్థలను నెలకొల్పడం ఆదర్శనీయమన్నారు. 70 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన సుబ్బయ్య సేవలు, చదువుపై ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు. ఎలాంటి లాభేక్ష లేకుండా విద్యా దానం చేసి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన సుబ్బయ్య మహనీయుడని, విద్యతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలను స్థాపించారని అన్నారు. సుబ్బయ్యను ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అద్భుతం సుబ్బయ్య నామస్మరణతో పులకించింది. పాలెంలో తోటపల్లి సుబ్రహ్మణ్యం శర్మ స్థాపించిన విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు వజ్రోత్సవాలకు వేలాదిగా తరలి రావడంతో వైభవంగా జరిగింది. 1963 నుంచి 2023 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు దశాబ్దాల తర్వాత కలుసు కోవడంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి గురువులు అప్పటి స్మృతులను, విద్యార్థుల చిలిపి చేష్టలను గుర్తు చేసుకున్నారు.
పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఒక పూట తినడానికి కూడా లేని కుటుంబాల్లో పుట్టి, సుబ్బయ్య స్థాపించిన హాస్టల్లో ఉండి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగామన్నారు. సుబ్బయ్య గారే నిజమైన దేవుడని ఆయన సేవలను కొనియాడారు.
వజ్రోత్సవాల నిర్వహణకు హర్నిశలు కృషి చేసిన పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బుడ్డయ్య, కార్యదర్శి మోహన్ బాబు, ముఖ్య వాలంటీర్లు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, అనుపటి లక్ష్మీకాంత్, డాక్టర్ అనుపటి మల్లికార్జున్, కాశిరెడ్డి గోపాల్ రెడ్డి, వస్పరి శివుడు, గోపాల స్వామి, శ్రీనివాస్ రెడ్డిలకు పూర్వ విద్యార్థులంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దిలీపాచారి, రుక్మారెడ్డి, కాశమోని వెంకటయ్య, నారదాసు మహేష్, డేగ శేఖర్, లక్ష్మయ్య, పృథ్వీరాజు, రామకృష్ణ, శ్రీధర్, కిషోర్, బంగారయ్య తదితరులు ఉన్నారు.
