- బాలనగర్ ప్రమాదంలో మృతులు ఐదుగురు
అనన్య న్యూస్, బాలనగర్: బాలనగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించిన అనంతరం మృతి చెందారు. ఒకరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించగా మరొకరు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాలానగర్ రోడ్డు ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మొత్తం 7 గురు ఆటోలో బాలనగర్ నుండి జడ్చర్ల వైపు వస్తుండగా, డీసీఎం ఆటోను ఢీకొట్టగా అక్కడికక్కడే 3 మరణించినట్లు, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలించిన అనంతరం చనిపోయినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ వెంట మహబూబ్ నగర్ ఆర్డిఓ అనిల్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ , 108 అంబులెన్స్ జిల్లా ఇంచార్జ్ కె.రవి, తదితరులు ఉన్నారు.
