అనన్య న్యూస్, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరు స్థానం సర్వత్రా ఆసక్తిరేపిస్తుంది. ఇక్కడ ఇద్దరు జాతీయ పార్టీల నాయకులు ఉండగా, మరొకరు సిట్టింగ్ ఎంపికే మళ్లీ టికెట్ ఇవ్వడం, బిజెపి నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, కాంగ్రెస్ నుంచి సిడబ్లుసి ప్రత్యేక అహ్వానితుడు, మాజీ ఎంఎల్‌ఎ చల్లా వంశీచందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురికి ముగ్గురు గత 2019 ఎన్నికల్లో బరిలోకి దిగినవారే. ఈసారి కూడా ఆ ముగ్గురే పోటీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభలో 14 లక్షల 18 వేల 672 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయన పాలమూరు లోక్‌సభ ఎన్నికను ఇన్‌చార్జిగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఆయనకు సవాల్‌గా మారనుంది. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్, మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల అన్నింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సిఎంతో పాటు ఏడుగురు ఎంఎల్‌ఎలు అందరూ ఎన్నికను సవాల్‌గా తీసుకోనున్నారు. ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేలందరికీ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాలమూరుకు సీఎం వరాల జల్లు కురిపించారు. పాలమూరు అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించారు.
జితేందర్ రెడ్డి చేరికతో జిల్లాలో బిజెపికి పెద్ద షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలో ఆయన అనుచరవర్గం, ఓటు బ్యాక్ పెద్ద ఎత్తున ఉంది. ఆయన రెండుసార్లు ఎంపిగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లోకి రావడంతో ఆ పార్టీకి కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక బిజెపిలో టికెట్ ఆశించి బంగపడిన బిసి నేత శాంతికుమార్ కూడా డికె అరుణ పట్ల అంత సానుకూలతగా లేనట్లు తెలుస్తోంది. డికె అరుణ ప్రధాని నరేంద్ర మోడీపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయనకు దేశంలో ఉన్న జనాకర్షణ తనకు కలిసివస్తుందని విశ్వసిస్తున్నారు.
బిజెపి నుంచి పాలమూరు లోక్‌సభకు పోటీ చేయాలనుకున్న మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి టికెట్ డికె అరుణకు దక్కడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ విషయాన్ని గమనించిన సిఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. స్వయంగా జితేందర్ రెడ్డికి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డికి ఢిల్లీల్లో ప్రభుత్వ ప్రత్యేక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు.