అనన్య న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో తీసుకున్న అత్యంత ప్రధానమైన పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జడ్చర్ల లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సోమవారం ఏర్పాటు చేసిన హరితోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం మొక్కలు నాటించి వాటిని సంరక్షించే కార్యక్రమం చేపట్టిన గొప్ప మహనీయుడు సీఎం కేసీఆర్ అని, హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్న స్వచ్ఛమైన గాలిని, నివాసయోగమైన ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ శాతం పెరిగిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో డిఐజి ఎల్.ఎస్ చౌహాన్, కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ కె నరసింహ, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జెడ్పీ సీఈఓ జ్యోతి, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, డీఎస్పీ మహేష్, తదితరులు పాల్గొన్నారు.