- రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేస్తా: బిత్తిరి సత్తి..
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజలు, పార్టీలు సహకరిస్తే తప్పకుండా తాను ఎన్నికల బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని కమెడియన్, ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి (చేవెళ్ల రవికుమార్) తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రజలు కోరుకుంటున్నారని, ఏ పార్టీ నుండైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా తాను జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని అన్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో బిత్తిరి సత్తి సామాజికవర్గం అయిన ముదిరాజ్ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆయన ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బిత్తిరి సత్తిని జడ్చర్ల నుండి పోటీ చేయాలని ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ విషయమై సత్తిని సంప్రదించగా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు మిత్రులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని పోటీ విషయంపై సమాలోచనలు చేస్తున్నానని వెల్లడించారు.