అనన్య న్యూస్, మహబూబ్ నగర్: ప్రజా పాలన అన్ని కౌంటర్లకు ప్రత్యేక రిజిస్టర్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అయన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు, 27వ వార్డులలో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 3వ వార్డు సరస్వతి నగర్ కాలనీ సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన సందర్భంగా స్వీకరిస్తున్న దరఖాస్తులకు సంబంధించిన రిజిస్టర్లు కౌంటర్లవారీగా పక్కాగా నిర్వహించాలని, అన్ని కౌంటర్లకు ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ ను ఆదేశించారు. ఇంద్రనగర్ కాలనీలోని వార్డు సభకు హాజరై అక్కడ ఏర్పాటు చేసిన క్యూలైన్లు, రిజిస్టర్ల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ వంటివి తనిఖీ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన కౌంటర్లతోపాటు, సాధారణ కౌంటర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలకు అయోమయం లేకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేస్తూ ఉండాలని సూచించారు. 27వ వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్లు, వార్డు పరిధిలోకి వచ్చే కుటుంబాలు, ఆ కౌంటర్ల ఇన్చార్జిల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జెడ్పిసిఓ జ్యోతి, మున్సిపల్ కమిసనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు విజయ కుమార్, రాజు, రహీముద్దీన్ తదితరులు ఉన్నారు.