అనన్య న్యూస్, మక్తల్: బీసీ ఏ రిజర్వేషన్ తోనే ముదిరాజ్ లకు బంగారు భవిష్యత్ ఉంటుందని, బీసీ డీ నుంచి బీసీ ఏ రిజర్వేషన్ కు ముదిరాజ్ లను మార్చడమే తన లక్ష్యమని మఖ్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. తనకు మంత్రి పదవి కన్నా ముదిరాజ్ లను బీసీ ఏ లోకి మార్చడమే అత్యంత ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డికి సైతం చెప్పానని తెలిపారు. బుధవారం మఖ్తల్ మత్స్య సంఘం అధ్యక్షుడు కోళ్ల వెంకటేష్ నేతృత్వంలో ముదిరాజ్ సభ్యులు వందల సంఖ్యలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలిసి సంగంబండ డ్యామ్ లో మఖ్తల్ వాసులకు చోటు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యేను శాలువా, గజమాలతో సత్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ… సంగంబండ డ్యామ్ లో మఖ్తల్ వాసులకు చోటు కల్పించే అంశంపై డ్యామ్ సంఘ అధ్యక్షుడు, డైరక్టర్లతో చర్చిస్తానని హమీ ఇచ్చారు. అయితే ముదిరాజ్ లకు బీసీ ఏ రిజర్వేషన్ అత్యంత కీలకమని, భవిష్యత్ తరాలు బాగుపడాలంటే బీసీ ఏ రిజర్వేషన్ ఉండాలని అన్నారు. తాజాగా అతి కొద్ది తేడాతో ముదిరాజ్ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారని, బీసీ ఏ రిజర్వేషన్ ఉంటే చాలా మంది ముదిరాజ్ లు ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకునేవారని అన్నారు. గతంలో సైతం బీసీ ఏ రిజర్వేషన్ కోసం జరిగిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న సంగతి గుర్తు చేశారు. మత్స్య శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉందని, త్వరలోనే పెద్ద ఎత్తున మఖ్తల్ నుంచి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మఖ్తల్ మండలంలోనే దాదాపు రెండున్నర టీఎంసీలు, భూత్పూర్ రిజర్వాయర్ లో మరో టీఎంసీ…దాదాపు నాలుగు టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, వాటిని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో మఖ్తల్ మత్స్య సంఘ అధ్యక్షుడు కోళ్ల వెంకటేశ్, చందాపురం చంద్రశేఖర్, వాకిటి అంజయ్య, మామిళ్ల కిష్టప్ప, తిరుపతి నర్సిములు, వల్లంపల్లి లక్ష్మణ్, వాకిటి శ్యామ్, కట్టా వెంకటేష్, కున్షి నగేందర్, బుజ్జప్ప, కాకులారం అశోక్, రేణుకా నర్సింహ, వాకిటి హన్మంతు, అంజి, మామిళ్ల పృథ్వీరాజ్, వి.శివశంకర్, వాకిటి రమేష్, కోళ్ల రత్న, ఈసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.