అనన్య న్యూస్, మహబూబ్ నగర్: పాలమూరు బిడ్డగా ఈ జిల్లాను అభివృద్ధి చేయకుంటే చరిత్ర నన్ను క్షమించదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన తమ మంత్రుల సహకారంతో అభివృద్ధి చేసి తీరతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. గత మూడు రోజులుగా పాలమూరులో జరుగుతున్న రైతు పండగ సదస్సుకు శనివారం హాజరైయారు. ఈ సందర్బంగా నిర్వహించిన భహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన జిల్లాకు చెందిన బూరుగుల రామకృష్ణారెడ్డి తొలి ముఖ్యమంత్రి గా చేశారని మళ్ళీ 70 సంవత్సరాల తరువాత మీ అందరి ఆశీర్వాదంతో తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని, వచ్చిన ఈ అవకాశం తో జిల్లాను అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. తాను చదువుకునే సమయంలో ఈ జిల్లా బిడ్డలు కూటి కోసం, బతుకు భారమై, కన్నవారిని, పసిబిడ్డలను వదిలి గంపెడు దుఃఖంతో బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లడం చూసి గుండె బరువెక్కేదన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆనాడే బలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపారు.
నవంబర్ 30, 2023కు దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది. పోలింగ్ బూత్ లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది పూర్తయింది. రైతు బిడ్డగా కొండారెడ్డి నుంచి బయలుదేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చా. నాకు ముఖ్యమంత్రి పదవి ఆశామాషీగా వచ్చింది కాదు. ఇది ఒక బాధ్యత అదే భాద్యత తో జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇప్పుడు ఈ జిల్లా అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటే బీఆరెస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో మీరు గమనించండి. పదేళ్లలో వాళ్ళు ఏం చేశారో నాకంటే మీకే ఎక్కువ తెలుసు అని అన్నారు. వాళ్ల పదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరిగిందా?.. రైతుకు గిట్టుబాటు ధర లభించిందా?.. వరి వేస్తే ఉరే అని చెప్పిన ఆనాటి పెద్దమనిషి కేసీఆర్…..కానీ ఈనాడు వరి ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటే, బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుంది అన్నారు. కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు రాకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి 66లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణ రైతులు పండించారు..వరికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండుగ చేసుకుంటున్నాం..అని తెలిపారు.

ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ ను రూ.7500 కోట్లకు తెగనమ్మి ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది11వేల కోట్లే.. ఈ 11 వేల కోట్లలో రూ. 8596 కోట్లు మిత్తికే పోయినయ్.. రైతులకు మీరు చెల్లించింది కేవలం రూ.2500 కోట్లేనని తెలిపారు.
మిస్టర్ హరీష్ రావు ఇది విను.. లెక్కలు కావాలంటే మళ్లీ చెబుతాం.. కేసీఆర్ కు ఈ వేదికగా సవాల్ విసురుతున్నా.. 25రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి..మోదీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి.. చర్చిద్దాం అన్నారు.మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం.ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి.. అసెంబ్లీలో చర్చిద్దాం.. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర మాది అన్నారు. రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్.. వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్.. రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్..అన్నారు.
కేసీఆర్.. పాలమూరు బిడ్డలు నిన్ను పల్లకిలో మోస్తే మా గుండెలపై తన్ని వలసలు పెరిగేలా చేసింది నువ్వు కాదా?
ఆనాడు పాలమూరును దత్తత తీసుకుంటా అని కేసీఆర్ అన్నాడు… కానీ పదేళ్ల ఆయన పాలనలో జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఇవాళ మేం నారాయణ్ పేట్ -కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే మాత్రం కాళ్లల్లో కట్టెలు పెడుతుండు.. పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డు పడుతున్నారు.. ఎవడో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడంకాదు.. మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్నాడు.. ఎవరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు..మనకు వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకుందామా?…పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం పూర్తి చేసుకోవద్దా? అని అడిగారు. ఓకే సంతకంతో మన జిల్లాకు కావాల్సిన అన్ని తెచ్చుకుందాం.. ఏడాదికొక 20వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరపున మా మంత్రి వర్గాన్ని నేను అడుగుతా.. ఐదేళ్లలో లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా?..అన్నారు.
నా ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడి యువత కోసం కొడంగల్ లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకుంటే..లగచర్ల చిచ్చు పెట్టి అమాయక లంబాడాలను జైల్లో పెట్టించిండ్రు…వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయిండ్రు… నేను ఆనాడే చెప్పిన వాళ్ల మాయ మాటలు నమ్మొద్దని అన్నారు. ఒక్క కేసీఆర్ కే గజ్వేల్ లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది… మా పారిశ్రామిక వాడ కోసం 1300 ఎకరాలు ఉండొద్దా అని అడిగారు ఆనాడు అధికారులపై దాడులు చేసి ఉంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా…అభివృద్ధి జరగాలంటే కొందరు నష్టపోక తప్పదు.. వారికి కావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. వాళ్లకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి… ఇప్పుడు వాళ్ళు వస్తారు.. పోతారు.. కానీ మన ప్రాంతానికి పరిశ్రమలు మళ్లీ వస్తాయా అన్నారు.
ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరం పరిస్థితే మారుతుంది… అలాంటి అవకాశం మీరు కోల్పోవద్దు అని ప్రజలకు సూచించారు. కేసీఆర్ నీ మొసలి కన్నీరు పాలమూరు జిల్లాపై కాదు..నేను ఇక్కడ పుట్టినోన్ని.. ఇక్కడి మట్టిలో కలిసే వాణ్ణి.. ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది… పారిశ్రామిక వాడ తెచ్చి 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే జిమ్మేదారి నాది.మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాణ్ణి కాదు అని అన్నారు. తోడేళ్ళు, పులులు ఎన్నో చూశా… మానవ మృగాలు మీరెంత అన్నారు. మాకు ఏ బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు..మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్ అని ప్రజలకు చెప్పారు.ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డిగా మారి అభివృద్ధిని ప్రజలకు చేర్చండి..నేను మీవాణ్ణి.. నన్ను ఆశీర్వదించండి… కుట్రలను కుతంత్రాలను తిప్పి కొట్టండి.. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది అన్నారు.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇది దొరల ప్రభుత్వం కాదు… ప్రజా ప్రభుత్వం… ఇందిరమ్మ రాజ్యం తీసుకున్న అనేక కార్యక్రమాలకు ఈ రైతు పండగ వేదిక అయ్యింది..అన్నారు.బీ ఆర్ ఎస్ వాళ్ళ మాటలు చూస్తే నవ్వొస్తుందని పదేళ్ల లో మీరు రైతులకు చేసింది సూన్యం అని చెప్పడం లో సందేహం లేదన్నారు.ఈ జిల్లా లో అన్ని ప్రాజెక్టు లు కాంగ్రెస్ నిర్మాణం చేసింది… ఈ ప్రాంతాన్ని మీరు ఎడారిగా మార్చారు… పక్కన ఉన్న కృష్ణ నది నీళ్లు రైతులకు ఎలా అందించాలో ఆలోచన చేస్తున్నాం అన్నారు.గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కాళేశ్వరం నిర్మాణం చేశారని విమర్శించారు.పదేళ్లపాటు లక్ష రూపాయలు రుణమాఫీ కూడ చేయలేదు. మీరు చేసిన రుణమాఫీ బ్యాంక్ వడ్డీకి కూడ సరిపోలేదన్నారు.
రైతులకు మేము మాట ఇచ్చాము.. రుణమాఫీ చేశామన్నారు. కొన్ని ప్రత్యేక కారణాలు వలన రుణమాఫీ కానీ వాళ్లకు మేము రుణమాఫీ చేశాము… ప్రతి ఇంటికి తిరిగి రుణమాఫీ కానీ రైతుల వివరాలు తీసుకోని నేడు రూ.3 వేల కోట్ల రూపాయలు, 3లక్షల 20 వేల రైతులకు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు.తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక బీమా డబ్బులు తామే చెల్లించి
దాదాపు 50 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని తెలిపారు.రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడం జరిగింది… 70 వేల కోట్లు బడ్జెట్ లో వ్యవసాయం కు కేటాయించి రైతులకు అండగా నిలిచామన్నారు.
ఈ కార్యక్రమం లో పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి,ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, సి ఎస్ శాంతి కుమారి,మంత్రులు దామోదర్ రాజానర్సింహా, జూపల్లి కృష్ణారావ్,కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.