అనన్య న్యూస్, హైదరాబాద్: వైద్య పరీక్షలు పేదలకు భారం కావొద్దనే ఉద్దేశంతో.. తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. 2018 జనవరిలో హైదరాబాద్‌లో టీ డయాగ్నొస్టిక్ సేవలు ప్రారంభించగా ఇప్పడవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖాలలోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. టీ డయాగ్నొస్టిక్ ద్వారా రెండు రకాలు పరీక్షలు నిర్వహిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
పాతలాజికల్ సర్వీసుల్లో భాగంగా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇమేజింగ్ సర్వీసుల్లో భాగంగా ఎక్స్ రే, యూఎస్‌జీ, ఈసీజీ, 2డీ, ఎకో, మెమోగ్రామ్ సర్వీసులు అందిస్తున్నారని తెలిపారు. డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 57.68లక్షల మంది రోగులు పరీక్షలు చేసుకొని దీని ద్వారా రూ.10.40 కోట్ల లబ్ధి పొందారని వివరించారు. డయాగ్నస్టిక్స్ సెంటర్‌లలో చేసే పరీక్షలను 134కు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. నీతి అయోగ్ డయాగ్నస్టిక్స్‌ను ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు. డయాగ్నస్టిక్స్ విజయవంతంగా నడిపించడంలో కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావుకు, ఆయన బృందాన్ని కేటీఆర్ అభినందించారు.