అనన్య న్యూస్, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రమబద్ధీకరణ విధివిధానాల ఖరారుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జేపీఎస్‌ల పనితీరు మదింపునకు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని పేర్కొన్నారు. జేపీఎస్‌లు ప్రొబేషన్ పూర్తయిన నేపథ్యంలో తమను రెగ్యూలరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు సమ్మెను విరమించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని సోమవారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ అంశంపై సచివాలయంలో చర్చించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.