- వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వంశన్న గెలుపు ఖాయం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
అనన్య న్యూస్, జడ్చర్ల: గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వివక్షకు గురైన పాలమూరు జిల్లా అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి అన్నారు. జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నిబద్ధత, విశ్వసనీయత, విలువలు మరిచిపోయి పాలమూరు జిల్లాకు మోసం చేసిన నేతలను ఇక పాలమూరు ప్రజలు నమ్మరని, నిబద్ధతతో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నైతిక విజయం ఇప్పటికే సాధించామన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో తాను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకొస్తానని తెలిపారు. గత పదేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరు మీద 80 శాతం నిధులను నొక్కేశారు కానీ 30 శాతం పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఉంటే ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి జడ్చర్ల నియోజకవర్గ మొత్తం సస్యశ్యామలమయ్యేదని, పాలమూరు బిజెపి నేతలు తమ పదవుల కోసం కొట్లాడారు తప్ప గతంలో స్వయంగా ప్రధాని మోడీ ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ హామీ గురించి ఏ ఒక్కరోజు మాట్లాడలేదన్నారు. ప్రధాని మోడీ దగ్గర వెళ్లి కనీసం అడగడానికి కూడా భయపడే నాయకులు వెన్నుముక లేని నాయకులు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నారన్నారు.
నేడు రాష్ట్రంలో పాలమూరు బిడ్డ సీఎంగా ఉన్నారని, ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, పాలమూరు ఎంపీ స్థానాన్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూర్చిన వాళ్ళమవుతామని, దాంతో పాలమూరు మరింత అభివృద్ధి పథంలో నిలుస్తుందన్నారు. పాలమూరులో గెలిచే ఎంపీ సీటు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి తొలి మెట్టు అవుతుందని దానికోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించి పాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కృషి చేయాలని కోరారు.
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నను గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం ఏర్పడుతుందని, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావాలన్నా, ఢిల్లీలో జాతీయస్థాయి నాయకుల అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు మీనాజ్, నాయకులు తదితరులు ఉన్నారు.