- బాదేపల్లిలోని పాత ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్ గా మార్చండి..
- బాలానగర్ 30 పడకల ఆసుపత్రిలో సిబ్బందిని నియమించండి..
- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వినతి..
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్లలోని వంద పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలని, రోగులకు మెరుగైన సేవలను అందించడానికి కావలసిన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్లలోని వంద పడకల ఆసుపత్రిలో సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆస్పత్రిలో డాక్టర్లు ఇతర సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. వంద పడకలకు సరిపడే వైద్యులు అందుబాటులో లేరని వైద్యుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఇతర సిబ్బంది ఖాళీలు చాలా ఉన్నాయని వాటిని కూడా భర్తీ చేసి రోగులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. బాలానగర్ లోని 30 పడకల ఆసుపత్రికి అవసరమైనటువంటి ఉద్యోగులను భర్తీ చేయాలని ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలని అనిరుద్ కోరారు. బాదేపల్లి లోని పాత ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్ గా మార్చాలని దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న అంబులెన్స్ స్థానాలలో కొత్త అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని కోరారు. క్రిటికల్ కేర్ యూనిట్ ను 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని కోరారు. జడ్చర్ల కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో అదనపు పడకలను చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ జడ్చర్లలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర శాసనసభ్యులు రాజేష్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీహరి లతో పాటు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, టీజీఎమ్ఐడిసి ఎండి హేమంత్, ఉమ్మడి జిల్లా డిఎంహెచ్ఓ లు, డి.జి.హెచ్ తదితర అధికారులు పాల్గొన్నారు.