- జాతీయ పతాకాలను ఎగురవేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు..
అనన్య న్యూస్, జడ్చర్ల: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నియోజకవర్గ కేంద్రంతోపాటు అన్ని మండలాల, గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద, బ్యాంకుల వద్ద అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో ర్యాలీలు నిర్వహించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలో పాల్గొని ఎన్సిసి విద్యార్థులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించి విద్యార్థులను అభినందించారు. ఎన్సిసి జాతీయ రాష్ట్రస్థాయి విభాగాల్లో ఉత్తమ ప్రతిభను సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాబాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.