అనన్య న్యూస్, జడ్చర్ల: భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లలను విక్రయించే ప్రయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణం గౌరీశంకర్ కాలనీలో హబీబున్నిసా బేగం అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు (ఒకరికి ఏడేళ్లు, మరొకరికి మూడేళ్లు), రెండేళ్ల కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త రఫీక్ భార్యా పిల్లలను పట్టించుకోకుండా నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండి అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు.
శనివారం గోవా నుంచి వచ్చిన రఫీ ఆదివారం జడ్చర్లలోని తన భార్యతో గొడవపడ్డాడు. ముగ్గురు పిల్లలకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. పిల్లలను తీసు కెళ్లడంతో ఆందోళనకు గురైన భార్య జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ రమేష్ బాబు రఫీ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడు ఉండే ప్రాంతానికి జడ్చర్లకు చెందిన హమీద్ ను, పోలీసు సిబ్బందిని పంపించారు. పిల్లలను విక్రయించేందుకు హైదరాబాద్ యాకత్పుర లో ఓ ఇంట్లో దాచి పెట్టినట్లు తెలియటంతో అక్కడికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు పిల్లలను తల్లికి అప్పగించినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.