- వాటిలో పేర్లు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- అర్హులైన వారి పేర్లు గ్రామ సభల్లో చేర్చుతాం
- గ్రామ సభల్లో ఆమోదం పొందిన తర్వాతనే తుది జాబితాలు సిద్ధం చేస్తాం
- స్పష్టం చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
అనన్య న్యూస్, జడ్చర్ల: రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించి అధికారులు ప్రస్తుతం సిద్ధం చేసిన జాబితాలు ఫైనల్ కాదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలుపుతూ గ్రామ సభల్లో అవసరమైన పేర్లను వాటిలో చేర్చి గ్రామ సభల ఆమోదం పొందిన తర్వాతనే తుది జాబితా సిద్ధమవుతుందని చెప్పారు. ఈ లోపుగా అధికారులు సిద్ధం చేసిన జాబితాల్లో తమ పేర్లు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలలో అనర్హుల పేర్లు, అర్హుల పేర్లు కనిపించడం లేదని పలు ప్రాంతాల నుంచి తన దృష్టికి ఫిర్యాదులు వచ్చాయని అనిరుధ్ రెడ్డి తెలిపారు.
అధికారులు సిద్ధం చేసిన జాబితాలో కొన్ని చోట్ల ఒకే రాజకీయ వర్గానికి చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. అయితే ప్రస్తుతం అధికారులు తయారుచేసిన ఈ జాబితాలు ఫైనల్ కాదని ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న గ్రామసభల్లో లబ్ధిదారుల తుది జాబితాలు తయారవుతాయని తెలిపారు. గ్రామ సభలలో అధికారులు తయారుచేసిన జాబితాలను సమీక్షించి వాటిలో నుండి అనర్హుల పేర్లను తొలగించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చడం జరుగుతుందని వివరించారు. ఈ విధంగా గ్రామ సభల్లో సమీక్షించి ఆమోదించిన జాబితాలు మాత్రమే ఫైనల్ అని అందరు గుర్తించాలని అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ లోపుగా అధికారులు చేసిన జాబితాలలో తమ పేర్లు లేవని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇతర పథకాలు అందేలా అర్హులైన వారందరి పేర్లు జాబితాలలో ఉండేలా చూసే బాధ్యత తనదేనని చెప్పారు. జిల్లా ఇంఛార్జి మంత్రి, ఎమ్మెల్యే లు కలిసి జాబితాలను చూసిన తర్వాతనే వాటిని ఆమోదించడం జరుగుతుందని అనిరుద్ రెడ్డి వెల్లడించారు. అయితే అధికారులు ఎవరైనా తాము తయారు చేసిన జాబితా లు ఫైనల్ అనే తప్పుడు సంకేతాలు ఇస్తే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని అర్హతలు కలిగి ఉన్నా ఎంపిక కాని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే అలాంటి వాటిని సరిదిద్దేలా చూస్తామని, నిజమైన అర్హులకు న్యాయం చేస్తామని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.