అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్లలో మొన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతం కంటే 10 సంవత్సరాలలో జడ్చర్లలో జరిగిన అభివృద్ధి పనులు ప్రతిపక్ష నాయకులకు కనబడుట లేదని, జడ్చర్ల పట్టణంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని అక్కడక్కడ కొన్నిచోట్ల చిన్నచిన్న పనులు మిగిలినవి, అవి కూడ పూర్తి చేసి జడ్చర్ల పట్టణమును మరింత అందంగా తీర్చిదిద్దామన్నారు.
సభ విజయవంతం కావడంతో ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రతి గ్రామం నుంచి ప్రజలు సొంత వాహనాలలో స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేశారని, ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ రాక కోసం సీఎం ప్రసంగం వినాలని ఉత్సాహంతో 3 గంటల పాటు ఎండకు కూర్చొని బిఆర్ఎస్ పార్టీపై తమకు అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. కెసిఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఏ పార్టీ నుంచి అభివృద్ధి సాధ్యం కాదని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందని కుటుంబం అంటూ లేదని అన్నారు.
మేనిఫెస్టోలో ఉన్న పథకాలు ఒక్కోసారి మేము కూడా మర్చిపోతున్నామని కానీ కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి ప్రజలే స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నారని అన్నారు. పార్టీలో చేరికలపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటున్నారని 500 మంది ఒకే ఊరు నుంచి వచ్చారంటున్నారు కదా వారిలో 5 మంది పేర్లు చెప్పండి చాలు మేము కూడా వచ్చి మీ వెంబడి తిరుగుతాం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటూనే స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్, ముడా డైరెక్టర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు, నాయకులు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.