అనన్య న్యూస్, జడ్చర్ల: మానవ మనుగడకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కీలకమని ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు అన్నారు. జడ్చర్ల మండలం కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మానవకుల దినోత్సవం పురస్కరించుకొని అన్ని తరగతుల విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. విద్యార్థులు అన్ని పోటీలలో ఉత్సాహంగా పాల్గొని బహుమతులను పొందారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని, భూమి పైన పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయని, జాతి, వర్ణ, లింగ, కులమత, రాజకీయ తదితర కారణాలతో వివక్ష లేని జీవితం గడపాలని అన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి మానవుకునకు ఉందని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కును పొందాలని అన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు తదితరులు ఉన్నారు.