అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గంలో నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండు రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహించుకుని, ప్రస్తుత మునిసిపల్ పాలకవర్గంపై అవిశ్వాసం పెట్టేందుకు తీర్మానించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశాన్ని రహస్యంగా నిర్వహించుకోవడంతో పాటు అంతర్గతంగా చర్చించుకున్న అంశాలు బయటికి పొక్కడంతో వాటిని సరిదిద్దుకునే కార్యక్రమంలో పడ్డారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఓటమిలో మునిసిపల్ పాలకవర్గం సభ్యుల అవినీతి ఆరోపణలే ప్రధాన ఆంశమయ్యాయని, అందుకనుగుణంగా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు తమ పదవులకు రాజీనామాలు చేయాలని, లేనిపక్షంలో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సైతం వెనకాడబోమనే అంశాన్ని చర్చించుకున్నట్లుగా తెలిసింది.
మునిసిపాలిటీలో 27 మంది కౌన్సిలర్లలో 23 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారున్నారు. వీరంతా గడిచిన రెండు రోజులుగా జాతీయరహదారిపై ఉన్న ఓ హోటల్లో రహస్య సమావేశం నిర్వహించుకున్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లకు తెలిపేందుకు శనివారం పట్టణంలోని ఓ కౌన్సిలర్ ఇంట్లో మరో సమావేశం నిర్వహించుకున్నారు. కొందరు కౌన్సిలర్లు చేసిన నిర్వాకాన్ని, కౌన్సిలర్లందరికీ ఆపాదించడంతో అందరి కౌన్సిలర్లపై ఓ రకమైన ముద్రపడిపోయిందంటూ ఓ కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ పాలకవర్గం ఏర్పడి రెండున్నరేళ్లు అయ్యిందని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి ముఖం చూడని వారున్నామంటూ మరో కౌన్సిలర్ వాపోయాడని తెలిసింది. పాలకవర్గంపై పడిన ఆవినీతి మచ్చతోనే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఓటమి చెందాడని, ఆ మచ్చ తుడిచేందుకు పాలకవర్గంలో సమూలమార్పు జరగాల్సిందేనంటూ అధికశాతం కౌన్సిలర్లు పట్టుబట్టినట్లుగా తెలిసింది.
పాలకవర్గంలో మార్పులు జరిగితే తామే అవినీతికి పాల్పడినట్లు స్పష్టం అవుతుందని, ఇది సరైందికాదంటూ కొందరు పేర్కొన్నట్లుగా తెలిసింది. మునిసిపల్ కౌన్సిలర్లు సమావేశం నిర్వహించుకుని చర్చించుకున్న అంశాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి దృష్టి కి తీసుకెళ్లేందుకు కౌన్సిలర్లు సిద్ధమైనట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మునిసిపాలిటీ పరిధిలో తమ పెత్తనం సాగదేమోనన్న అనుమానంతో కౌన్సిలర్లతో ఓ నాయకుడు చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు సైతం వెలువడుతున్నాయి. కాగా కౌన్సిలర్లు అందరం కలిసి సమావేశం నిర్వహించుకున్న మాట వాస్తవమేనని, టీఎఫ్ఐడీసీ నిధుల అంశంపై చర్చించుకున్నామంటూ ఓ నాయకుడు వెల్లడించదించారు.