- జడ్చర్లలో కాంగ్రెస్ కు భారీ షాక్..
అనన్య న్యూస్, జడ్చర్ల: కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆదివారం ఎర్ర శేఖర్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఎర్ర శేఖర్ గతంలో జడ్చర్ల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్చర్ల టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి ఆ సమయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం టికెట్ కోసం ఎర్ర శేఖర్, అనిరుధ్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ జరిగింది. కానీ చివరికి అనిరుధ్ రెడ్డికే టికెట్ కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో ఎర్ర శేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం తన అనుచులతో ఆయన సమావేశం అయ్యారు. తాజాగా పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ లో చేరారు. ఇదే జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నాగర్ కర్నూల్ టికెట్ ను ఇవ్వకపోవడంతో నాగం జనార్దన్ రెడ్డి పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రశేఖర్ బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని బిఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.