అనన్య న్యూస్, జడ్చర్ల: ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మల్లురవి, జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం మిడ్జిల్ మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మల్లు రవి, అనిరుద్ రెడ్డి లు పాల్గొన్నారు. మల్లురవి మాట్లాడుతూ ఈ జన సమూహాన్ని చూస్తుంటే జడ్చర్ల ఎమ్మెల్యేగా జనంపల్లి అనిరుద్ రెడ్డి కచ్చితంగా 50 వేల మెజారిటీతో గెలుపొందుతాడని అన్నారు. కాంగ్రెస్ లో టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి ఇద్దరు మునిగిపోతున్న నావాలోకి వెళుతున్నట్లు ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ మీ ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి మాట్లాడుతున్న అంటే ఇదే మీ అందరి సహకారంతోనే సాధ్యమైందని, గత తొమ్మిది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలు అభివృద్ధి చెంద లేదని, జడ్చర్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి పేదవాడికి సంక్షేమం అందుతుందన్నారు. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలకు మండలంలోని వివిధ గ్రామాలలో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వివిధ మండలాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.