అనన్య న్యూస్, జడ్చర్ల: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి. రవి నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జడ్చర్ల పట్టణంలోని బిఆర్ఆర్ కళాశాలలో ప్రతిపాదిత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సామాగ్రి పంపిణీకి ఎన్నికల సంఘం నిర్దేశించిన సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్రాలు ఉండాలని, ఈవీఎంల కమిషనింగ్, భద్రత అవకాశాలను పరిశీలించారు. కళాశాల గదులను, అధికారులు, సిబ్బంది తదితరులకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించారు.
జడ్చర్ల రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు తో మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైతే మోడీఫికేషన్ లను చేయాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ సందర్భంగా సిబ్బందికి, అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, అంతేకాక ఈవీఎంలు భద్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని, అవసరమైన భారీ కేడింగ్, పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగ్, టాయిలెట్లు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట జడ్చర్ల తహసిల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.