- సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తా..
అనన్య న్యూస్, జడ్చర్ల: సీఎం కేసీఆర్ దీవెనలు, ప్రజల ఆశీర్వాదం, మీ అందరి సహకారంతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి జడ్చర్ల నియోజకవర్గ మరింత అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ లతో కలిసి జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్చర్లలోని ఆయన నివాసానికి చేరుకొని భారీగా తరలివచ్చిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్, పూలే, శ్రీకాంతాచారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు జడ్చర్ల నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందని, ఇంకా జరగాల్సిన పనులు ఉన్నాయని అది బిఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని, ప్రజల సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి ఆశీస్సులతో భారీ మెజారిటీ సాధిస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ పదేండ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధిం చి, 20 రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిచిందని, ఒకవేళ కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతులు, ప్రజలను ఏ మాత్రం పట్టించుకోలేదని, నీళ్లు, విద్యుత్, విద్య, వైద్యం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మోసపు హామీలతో వస్తున్నదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నారు. విద్య, వైద్య రంగం ప్రజలకు చేరువైందని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నియోజకవర్గానికో 100 పడకల దవాఖాన, 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగడమే ఇందుకు నిదర్శనమన్నారు. నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జడ్చర్ల అభివృద్ధికై బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.