ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పెరుగుతున్న రాజకీయ వేడి..
అనన్య న్యూస్, జడ్చర్ల: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు మార్గాలను అన్వేషించడంలో నిమగ్నమైనారు. తమకు అనుకూలంగా వ్యూహాలను, ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా రహస్య మీటింగులు, నాయకుల చేరికలతో ఎలక్షన్ స్ట్రాటజీని సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఏదేమైనాప్పటికీ ఈ ఎన్నికల్లో తన గెలుపుతో పాటు ప్రత్యర్థిని ఎలా దెబ్బ తీయాలనే రెండు కోణాల్లో సమీ కరణలు తయారు చేస్తున్నట్టు సమాచారం.
జడ్చర్ల నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండగా బిఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటీ జరుగుతుంది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి ల మధ్య పోటీ జరుగుతుంది. గెలుపుపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. నలుగురు కలిసిన ప్రతిచోట రాజకీయ చర్చలే నడుస్తున్నాయి. ఇలా అభ్యర్థులు ఇద్దరు గెలుపుపై వ్యూహరచనలు చేస్తున్నారు.
అభ్యర్థుల గెలుపు ధీమా ఇలా:
నియోజకవర్గంలో గెలుపోటములపై రోజురోజుకు టాక్ మారుతోంది. దీంతో అంతర్మధనంలో పడుతున్న అభ్యర్థులు తమ ప్రచారంలో ప్రత్యర్థులపై అస్త్రాలను సంధిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి తన ప్రచారంలో గత పదేళ్లుగా చేసిన అభివృద్ధిని, ప్రభుత్వపరంగా అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభతో నియోజకవర్గ కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ జోష్ పెంచారు. ఈ విధంగా పెరిగిన జోష్ తో తన గెలుపు సునాయసమవు తుందని అంచనాలు వేసుకుంటున్నారు. దీనికి తోడు గ్రామస్థాయిలో తమకు ఉన్నటువంటి కార్యకర్తల బలం, ప్రజల ఆశీర్వాదం, తను చేసిన పనులు మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు వివరిస్తూ తన గెలుపు బాటలు వేసుకుంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి సైతం ఐదేళ్లుగా తాను అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ అందరికీ అండగా ఉన్నానని, యువ నాయకునిగా, స్థానిక నాయకునిగా ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేసేందుకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం వస్తున్న ఆదరణ, ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీల అభ్యర్థులు గెలుపోటములపై అంచనాలు వేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇంతటి రసవత్తర పోరులో జడ్చర్ల గడ్డపై జెండా పాతేదెవరో అనే అనుమానం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది.
ఈ ఇద్దరికీ ప్రస్తుత ఎన్నికలు రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారడంతో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ నియోజకవర్గంలో జెండా పాతేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఏదేమైనా ఓటర్ మహాశయుల మన్ననలు పొంది గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.