ఆధార్ సెంటర్ ముందు క్యూ కట్టిన ప్రజలు..
అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణలో ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డ్ ఈ కేవైసీతో ప్రజలకు ఆధార్ కార్డు నవీకరణ (అప్డేట్) కష్టాలు తీరడం లేదు. గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రంగరావుతోటలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఆధార్ అప్డేట్ కోసం క్యూ కట్టారు. శుక్రవారం ఆధార్ అప్డేట్ చేసేందుకు నిర్వాహకులు ఒకరోజు ముందుగా ఇచ్చే టోకెన్ కోసం ప్రజలు ఒక్కసారిగా గుమ్మి గూడారు. ఆరోగ్యశ్రీ ఈ కేవైసీ, రేషన్ కార్డు ఈ కేవైసీ తో తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారు. నిర్వాహకులు ఒక్క రోజుకు గాను 60 మందికి టోకెన్లు ఇవ్వగా గురువారం దాదాపు 300 మంది పైగా వచ్చారు. ప్రజల ఇబ్బందులను గమనించి అప్డేట్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అధికారులు సమస్యపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.