అనన్య న్యూస్, జడ్చర్ల: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రతి గడప గడపకు అందుతాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ గ్యారంటీ కార్డు ని ప్రజలకి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. రాజీవ్ నగర్ కాలనీలో సరైన డ్రైనేజీ, రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులతో ఇండ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీములను అమలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.
అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు:
జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 30 మంది, బాల్ నగర్ మండలంలోని చిన్న రేవల్లి, జడ్చర్ల మండలం దేవుని గుట్ట తండా కి చెందిన 70 మంది యువకులు ఆదివారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.