అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడి పదేళ్లు గడుస్తున్న ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని, కాంగ్రెస్ వస్తేనే పేదల కల సాకారమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ చేపట్టిన రెండు రోజుల పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బహిరంగ సభ తో పాటు, మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో చేపట్టిన కార్నర్ మీటింగులలో జన సందోహం పోటెత్తింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బిఆర్ఎస్ పార్టీతో పాటు బిజెపి, ఎంఐఎం పార్టీలపై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన శాఖలన్నీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల వద్దే ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే అప్పుల ఊబిలోకి నెట్టివేశారని, 2040 వరకు ఒక్కొక్కరిపై ఏటా రూ. లక్షకుపైగా అప్పు భారాన్ని మోపారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజన, బడుగులకు ఇచ్చిన భూము లను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కొంటుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,500, కేవలం రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళ లకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. తాను స్వయంగా జిల్లెలలో వృద్ధులతో మాట్లాడానని, ఇప్పుడు రూ.2 వేలు మాత్రమే వస్తున్నాయని చెప్పగా తాము అధికారంలోకి వచ్చాక నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తామని భరోసా ఇచ్చానన్నారు. సభలో రాహుల్ తన ప్రసంగాల చివరలో జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి, దేవరకద్ర అభ్యర్థి మధుసూదన్ రెడ్డి, కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి లను ప్రజలకు పరిచయం చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కల్వకుర్తి సభ, జడ్చర్ల కార్నర్ మీటింగ్ లలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల, దేవర కద్ర ఎమ్మెల్యే అభ్యర్థులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మధు సూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్య దర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రబ్బాని, మాజీ ఎంపీపీ నిత్యానందం, నాయకులు అశోక్ యాదవ్, బుక్కవెంకటేశం, మినాజ్, శ్రీనివాస్ గౌడ్, విజయ కుమార్ రెడ్డి, సంజీవ యాదవ్, భూపతిరెడ్డి పాల్గొన్నారు.