- కానీ ఆశించిన లక్ష్యాలను, చేరాల్సిన గమ్యాలను చేరలేదు..
అనన్య న్యూస్, హైదరాబాద్: 75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే. అయినా, ఆశించిన లక్ష్యాలను చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడంలేదు. అన్నీ ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పుటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.