అనన్య న్యూస్, హైదరాబాద్: అన్ని పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక పంటలకు కనీస మద్దతు ధర 60 నుంచి 80 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. కాలానుగుణంగా పంటల బీమా పథకంలో మార్పులు తీసుకవస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పంటల బీమా పథకం అమలు సరిగ్గా జరగట్లేదని అన్నారు. దేశంలో 52 శాతం పాల ఉత్పత్తి పెరిగిందన్నారు. 2009 – 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1.52 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు కొనుగోలు చేసిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత గత నాలుగేళ్లలోనే 82.21 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులను కేంద్ర ప్రభుత్వం సేకరించినట్లు చెప్పారు.
అన్ని పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆహార ఉత్పత్తులకు ప్రకటించిన ఎంఎస్పీ ధరలు 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని వివరించారు. ప్రధాన్ మంత్రి కృషి సించాయ్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో చిన్న సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులకు గానూ రూ.1,248 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర రైతులకు ఎరువుల మీద రూ.27 వేల కోట్ల సబ్సిడీని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎకో ఫ్రెండ్లీ లిక్విడ్ నానో యూరియా తయారీ ప్రారంభమైనట్లు తెలిపారు.