అనన్య న్యూస్, హైదరాబాద్: నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ కానుక పేరిట 20 వేల కుట్టుమిషన్లు అందజేయనున్నారు. ఈ మేరకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కుట్టుమిషన్ల కోసం ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. శిక్షణ ఇప్పించటంతో పాటు, కుట్టుమిషన్లను ఉచితంగా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
మైనారిటీలందరికీ 18 వేలు, క్రిస్టియన్ మైనారిటీలకు 2 వేల కుట్టుమిషన్లు అందించనున్నట్టు వివరించారు. 21-55 ఏండ్ల వయసు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన మైనారిటీ మహిళలు అర్హులు అని వెల్లడించారు. ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతలు, పాస్‌పోర్ట్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయం అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఒంటరి, వితంతు, విడాకులు పొందిన, నిరుపేద మహిళలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.