అనన్య న్యూస్, హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు బుధవారం అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే రూ.వెయ్యి వేతనాన్ని పెంచారని గుర్తుచేశారు. ఇప్పటికీ సీఎం కేసీఆర్ దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్మికులతో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత వరకు త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పారిశుద్ధ్య కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు. గత ప్రభుత్వాలలో రూ.500, రూ.1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అడగ కుండానే సీఎం కేసీఆర్ రూ.8,500కు పెంచారన్నారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే రూ.8,500 నుంచి రూ.9,500కు పెంచారన్నారు.