అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ మూడవసారి సీఎంగా అధికారాన్ని నిలబెట్టు కునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందు కోసం ఓటర్లను ఆకర్శించే కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతిపక్షాలకు కొత్తగా హామీలు ఇచ్చే అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయని రుణమాఫీని కాంగ్రెస్ అస్త్రంగా మలచుకోవాలనీ భావించింది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. రైతు రుణ మాఫీని వెంటనే ప్రకటించారు.
ఇప్పుడు ఉద్యోగులకు ఆకట్టుకొనేందుకు పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటనకు సిద్ధం అవుతున్నారు. పోడు భూముల పట్టాలు, ఆర్టీసీని సర్కారులో విలీనం చేయడం, రైతు రుణమాఫీ, వీఆర్ఎల క్రమబద్ధీకరణ, రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు, బీసీలు, మైనార్టీలకు రూ. లక్షసాయం, గృహలక్ష్మి, దివ్యాంగులకు పెన్షన్ పెంపు, గురుకుల విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, హైదరాబాద్ మెట్రో విస్తరణ నిర్ణయాలు అన్నీ ఓటు బ్యాంకును ఆకర్శించడంతోపాటు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేసేలా ఉన్నాయి. 29.61 లక్షల మంది రైతులకు సంబం ధించిన రూ.19 వేల కోట్ల రుణమాఫీకి పచ్చజెండా ఊపడంతో రాజకీయంగా పరిస్థితిలో తమకు అనుకూలత ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.మొత్తం మీద గులాబీ బాస్ ఎట్లయినా హ్యాట్రిక్ కొట్టాలనే గట్టి లక్ష్యంతో రోజుకో కొత్త నిర్ణయం ప్రకటించి ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారు.
సీఎం కేసీఆర్ ఏ పూట ఏ ప్రకటన ఇస్తారో? ఏం తాయిలాలు ప్రకటిస్తా రోననే ఆందోళన ప్రతిపక్ష పార్టీల నేతల్లో నెలకొంది. దీంతో వారు మరింత అలర్ట్ అయ్యారు. తాము కూడా సభలు, సమావేశాలకు కసరత్తుచేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే ఎన్నికల హామీలు, మ్యానిఫెస్టోలతో రాష్ట్ర రాజకీయం మరింత రంజుగా ఉండనున్నది. అయితే సీఎం కేసీఆర్ వ్యూహం చూసి గులాబీ పార్టీ నేతలు భలే సంబరపడిపోతున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాలు వేసుడులో మా పెద్ద సారుకు సాటిరాగల వారెవ్వరూ అని మురిసిపోతున్నారు.