అనన్య న్యూస్, హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 2 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ లోని హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ రోజున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి, అక్టోబర్ 2 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్ గెలుపును అందిద్దామని పిలుపునిచ్చారు. రాజకీయ భవిష్యత్తుకు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని, పోరాడేవారికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టాలన్న సీఎం కేసీఆర్ కుట్రలో భాగమే ధరణి పోర్టల్ అని ఆరోపించారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు రద్దు అవుతుంది అని కెసిఆర్ అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని అన్నారు. దేశాన్ని దోచుకోవడమే డబల్ ఇంజన్ పని అని, వన్ నేషన్ వన్ పార్టీ అనేది బిజెపి రహస్య ఎజెండ అని ఆరోపించారు. బిజెపి కుట్రలను చేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించాలని కార్యకర్తలకు సూచించారు.