- సహజ రంగులే ముద్దు..
- రసాయన రంగులు వద్దు..
అనన్య న్యూస్: భారతదేశంలో చిన్న, పెద్ద తేడా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగి తేలే పండుగే హోలీ. రంగుల వేడుకలను కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో 2 రోజులు ఇలా రకరకాలుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా హోలీ చరిత్ర ఏంటి.. హోలికా దహనం, రంగుల పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. ఈ ఏడాది 2024లో మార్చి నెలలో 25వ తేదీ సోమవారం వచ్చింది.
ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు రంగుల వానలో తడిచి ముద్దవుతారు. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఆనవాయితీగా వస్తోంది. హోలీ అంటే అగ్నికి సంబంధించినది. దీన్నే హోలీకా పూర్ణిమ అని అంటారు. ఈ సమయంలో కాముని దహనం, డోలికోత్సవం వేడుకలను జరుపుకుంటారు.
రంగుల పండుగను ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బర్సానా, నంద గ్రామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి ప్రారంభిస్తారు. ఈ పండుగ దాదాపు 40 రోజుల వరకు కొనసాగుతుంది. మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వేడుకలను చూసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. ఈ సందర్భంగా హోలీ పండుగ వెనుక ఉన్న కథేంటి.. ఎందుకని రంగుల పండుగను జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హోలీ అంటే అగ్నితో పునీతమైనదని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో వస్తుంది. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది అతడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతడి రాక్షససోదరి హోళీకను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు. దీంతో ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. అప్పుడు విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోలిక రాక్షసి మాత్రం ఆ మంటలో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని ప్రచారంలో ఉంది. అందువల్ల రాత్రి పూట కామదహనం చేస్తారు.

రసాయనాలతో చేసిన రంగుల కంటే సంప్రదాయ రంగులే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఇష్టారీతిన రంగులు చల్లుకోవడం వల్ల అవి కళ్లలో పడి తీవ్ర ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే రసాయన రంగుల్లో లెడ్ ఆక్సైడ్, అల్యూమినియం బ్రొమైడ్, మెర్క్యురీ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ ఉంటాయి. వాటి గాఢతను బట్టి రంగులు కళ్లలో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. గులాల్ వంటి రంగు పొడులతో అస్తమా, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రసాయన రంగులను సాధ్యమైనంత వరకు దూరం చేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.