- జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్పోటనం కన్న ప్రమాదం.
అనన్య న్యూస్, హైదరాబాద్: జీవో 111 రద్దు దుర్మార్గపు చర్య అని, జీవో రద్దు వెనుక భారీ కుంభకోణం దాగుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్పోటనం కన్న ప్రమాదం అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పేరు చెప్పి సమస్యను సీఎం కేసీఆర్ చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
జీవో 111 రద్దుతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. 111 జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ప్రమాదమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ 111 జీవో ఆదేశాల వెనక నేపథ్యం గమనించాలన్నారు. 1908లో హైదరాబాద్ కు వరదలు వచ్చి 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందన్నారు. దీంతో వరద నివారణకు ఆనాటి నిజాం గ్లోబల్ టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో మూసీ, ఈసా నదులపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించారన్నారు. జంట జలాశయాలను రక్షించేందుకు 1996లో 111 జీవోను ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. 84 గ్రామాలను బయో కన్సర్వేషన్ జోన్ లో పెట్టారన్నారు. నిజాం, సమైక్య పాలకులు కూడా నగరాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా 111 జీవోను అమలు చేశారన్నారు. కానీ సీఎం కేసీఆర్ ధన దాహంతో జీవో 111ను రద్దు చేశారన్నారు. ఈ జీవో రద్దు వెనక కుట్ర ఉందన్నారు. 80 శాతం భూములు సీఎం కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. 111 జీవో రద్దు దుర్మార్గపు నిర్ణయమన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పోరాటం ఫలితంగానే కృష్ణా, గోదావరి జలాలు తరలింపు జరిగిందన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను విధ్వంసం చేసే హక్కు సీఎం కేసీఆర్ కు ఎవరిచ్చారన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు పైప్ లైన్ ఇస్తాననడం వెనక కుట్ర దాగుందన్నారు. ఈ విషయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీని వెనక లక్షల కోట్ల కుంభకోణం దాగుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.