అనన్య న్యూస్, ఢిల్లీ: వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మందులనే రాయాలని కేంద్ర ఆదేశించింది. లేదంటే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లైసెన్సును కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈమేరకు నేషనల్ మెడికల్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పేరుతో జారీ చేసిన కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. 2002లో భారత వైద్య మండలి జారీ చేసిన నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి వైద్యుడు జనరిక్ మందులనే ప్రిస్రైబ్ చేయాలనే సూచనలు ఉన్పప్పటికీ దీనికి భిన్నంగా వ్యవహరించే వైద్యులపై ఎలాంటి చర్యలను అందులో పేర్కొనలేదు.
తాజాగా ఆ నిబంధనల స్థానంలో ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ నియమావళి 2023 అమల్లోకి తెచ్చినట్టు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) వెల్లడించింది. ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై చర్యలను కూడా పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి రిజిస్టర్ మెడికల్ ప్రాక్టిషనర్ తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్ పేర్లతో ఔషధాలను రాయాలి. అనవసర మందులు, అహేతుకమైన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ట్యాబ్లెట్లను సూచించకూడదుని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు వైద్యులను హెచ్చరించడంతోపాటు వర్క్‌షాపులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారు. ఒకవేళ పదేపదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఆ వైద్యుడి లైసెన్సును కొంతకాలం పాటు నిలిపివేయనున్నట్టు నిబంధనల్లో వెల్లడించారు.
వైద్యులు రాసే మందుల చీటీలో ఔషధాల పేర్లను క్యాపిటల్ అక్షరాల్లో రాయాలని జాతీయ వైద్య కమిషన్ ఆ నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తీ తన సంపాదనలో అధిక భాగం హెల్త్ కేర్ కోసమే వెచ్చించాల్సి వస్తుంది. బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే జనరిక్ మందుల ధరలు 30 నుంచి 80 శాతం తక్కువగానే ఉన్నాయి. వైద్యులు జనరిక్ మందులనే ప్రిస్రైబ్ చేయడం వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతోపాటు అందరికీ నాణ్యమైన, ఆరోగ్య సంరక్షణను అందించినట్లవుతుందని ఎన్‌ఎంసీ తమ నిబంధనల్లో పేర్కొంది.