అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం విద్యార్థులను తీసుకెళ్తున్న మౌంట్ బాసిల్ పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. జడ్చర్ల మండలం కొత్త తండా సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ స్కూల్ బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సు డివైడర్ కు తగిలి బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త తండా సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ పాఠశాలకు చెందిన 7వ నెంబర్ గల బస్సు విద్యార్థులతో జడ్చర్ల వైపు నుంచి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో బస్సు స్కూలుకు మల్లుతున్న క్రమంలో యూటర్న్ వద్ద వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్టు సమాచారం.
గాయపడిన 30 మంది విద్యార్థులను హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే 167వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మౌంట్ బాసిల్ పాఠశాల బస్సు బోల్తా పడిన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా పాఠశాల వద్దకు పరుగులు తీశారు. తమ పిల్లలకు ఏం జరిగిందనే ఆందోళన చెందారు. సంఘటన జరిగిన వెంబడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.