అనన్య న్యూస్: తెలంగాణ సీఎంవో సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తరచూ సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. మంచి అధికారిణిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. మొట్టమొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారామె. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ అంచెలంచెలుగా ఎదిగారామె. తాజాగా ఆమె శనివారం ఎమోషనల్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో తాగునీటి కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులు ఆమెను ఆవేదనకు గురి చేశాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు బావిలోకి తాడుసాయంతో దిగడానికి సంబంధించిన వీడియో ఆమెను కలచివేసింది. తాగునీటి కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ బావిలోకి దిగడంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది.
బతకడానికి కాసిన్ని నీళ్లు తాగేందుకు తెచ్చుకోడానికి ప్రాణాలను సైతం త్యాగం చేయాల్సిన పరిస్థితి రావడంపై దేశం యావత్తు ఆశ్చర్యానికి గురి అవుతోంది. ఈ వీడియోపై స్మితా సబర్వాల్ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ స్మితా సబర్వాల్ పోస్టు పెట్టారు. “ఒకే దేశం, విభిన్న జీవితాలు, విధి ఎంత విచారకరం” అని ఆవేదన చెందారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేస్తోందని ఆమె వెల్లడించడం విశేషం.