హైదరాబాద్, అనన్య న్యూస్: హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసేందుకు శనివారం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్లు భారీర్యాలీతో రాజ్ భవన్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు తమిళిసైని కలవాలని అనుకున్నారు. అయితే ఉదయం నుంచి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయప్ర త్నిస్తున్నా ఖరారు కాకపోవడంతో వారిని రాజ్ భవన్ వర్గాలు లోనికి అనుమతించలేదు. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో రాజ్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
రాజ్ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతద్రను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో మేయర్ వాగ్వాదానికిదిగారు. రాజ్ భవన్ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేయర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు జీహెచ్ఎంసీమేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై బండిసంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా మహిళా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగినట్లు విజయలక్ష్మి తెలిపారు. బండిసంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని తామంతా రాజ్ భవన్ కు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. వెంటనే బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.