Sunday, March 23, 2025

Sun God: ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం.. సూర్య భగవానుడు..

  • వేదములు కీర్తించుచున్న పరమాత్మ సూర్యుడే.
  • పురాణములు పేర్కొన్న అంతరాత్మ సూర్యుడే.
  • ఆదివారం సూర్య భగవానుని పూజిద్దాం.
  • ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని అనుగ్రహం పొందుదాం ..

అనన్య న్యూస్: ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానుడి విశిష్టతను ఆ సూర్య భగవానుడి వారమైన అదివారం ప్రత్యేకతను తెలుసుకుందాం. ప్రత్యక్షముగా దర్శనమిచ్చు దేవత ఆదిత్యుడైన సూర్య భగవానుడు. ఆదిత్యుడు సర్వమునే వీక్షించుచున్నాడు. ఈ జగత్తున సృష్టి స్థితి లయములు ఆయన వలననే జరుగుచున్నవి. సర్వభూతములకు అతడే హేతువు. కృతయుగము నుండి సూర్యుడే కాల స్వరూపము. ఇంద్రాది దేవతలు అతని రూపములే, వేదములు కీర్తించుచున్న పరమాత్మ సూర్యుడే పురాణములు పేర్కొన్న అంతరాత్మ సూర్యుడే..


సర్వ జీవ దేహముల యొక్క నిర్మాత, ప్రేరకుడు సూర్యభగవానుడు. సూర్యమండల స్థితుడైన ఇతనిని జపించిన వారికి సర్వసిద్ధులు లభిస్తాయి. ఎవరైతే ఆదివారం సూర్యుని ఆరాధిస్తారో వారికి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక దు:ఖములు దరిచేరవు. సూర్యోపాసన చేసినవారికి గ్రహశాంతి అవసరము లేదు. అంత ప్రముఖ మైనది సూర్యారాధన. ఆదిత్యునకు అర్ఘ్యతర్పణములు అత్యంత ప్రీతికరములు. అందువలన సూర్యారాధన విశిష్టమైనది.


సూర్యారాధనలో అంశలను పన్నెండుగా గుర్తించారు. పన్నెండు నామములతో ఆయనను ఆరాధన చేయడం ఒక సనాతన రహస్యం. ధాతీ, ఆర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్‌, పూషా, పర్జన్య, అంశుమాన్‌, భగ, తష్ట్వా. విష్ణు. ఇవి ద్వాదశాదిత్య నామాలు. ద్వాదశ స్వరూపుడైన ఆదిత్యుని విస్తారము తొమ్మిది వేల యోజనములు. మూడు వందల కిరణములు ముల్లోకములను పాలించుచున్నవి. అవతార పురుషులు సైతము సూర్యోపాసన చేసి విజయము సాధించినారు.

శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయమును పఠించి రావణ సంహారం చేసినాడు. ధర్మరాజు సూర్యుని స్మరించి అక్షయ పాత్రను పొందినాడు. సత్రాజిత్తు సూర్యోపాసన చేసి శ్యమంతకమణిని పొందినట్లు మనకు తెలుస్తుంది. కుంతీదేవి కర్ణుని, ఋక్ష రజస్సు అను వానర శ్రేష్టుడు సుగ్రీవుని సూర్యుని స్మరించి పుత్రులుగా పొందారు. వేదములలో సూర్యుడు ఆరోగ్యదేవత అని పేర్కొన్నవి. ఇక ఆధునిక వైద్యశాస్త్రము కూడా సూర్య కిరణములు అనేక వ్యాధులను, రుగ్మత లను రూపుమాపునని నిరూపించినది. శరీరానికి ముఖ్యమైన విటమినులను ఉదయకాల సూర్య కిరణములు పుష్కలముగా అందించునని సూచించుచున్నది. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్నట్లు ఆరోగ్య ప్రదాత సూర్యుడు. సూక్ష్మముగా ఆలోచించిన మన భూమిపై జీవమునకు కారణము సూర్యుడు. సూర్యకిరణముల తాకిడిచే సమస్త జీవజాలము జనించి, జీవించుచున్నవి.

అందువలననే మనకు ఆదివారము ప్రసాదించబడినది. ఆదివారము నాడు సత్యవ్రతులై, శుచిర్భూతులై కొన్ని నియమములను పాటించి సూర్యారాధన, ఇష్టదైవ సంకీర్తన చేసినవారికి ఆరోగ్యమేగాక సచ్చిదా నందము కల్గునని మన సనాతన ధర్మము ధృవీకరించినది. సూర్య నమస్కారములను యోగ మార్గము మన భారతీయ సంస్కృతిలో ఒక ఆరోగ్య నిధి సమానమైనది. ఆదివారము ఆద్యంతమూ మంత్ర పఠనమునకు, పూజలకు అత్యంత ఫలప్రదమైనది.


సూర్యోదయమునకు ముందే నిద్ర నుండి మేల్కొనడమనేది ఒక గొప్ప సుగుణం. ప్రాత:కాల బ్రహ్మ ముహూర్తమున స్నానమాచరిం చడమనునది అనేక ప్రయోజనములను చేకూర్చునని మన శాస్త్రములు తెలియ చేస్తున్నాయి. అలాగే సూర్యునికి అభిముఖముగా ఎటువంటి అనాచార క్రియలు చేయకూడదని విజ్ఞులు సూచిస్తున్నారు. కావున మనము కూడా ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని పూజించుదాము. సూర్య ప్రసాదమైన కిరణములను ఆస్వాదించి ఆరోగ్య అనుగ్రహం పొందుదాము.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular