- పంటల సాగులో రసాయనిక పురుగుల మందు వాడటమే కారణం..
అనన్య న్యూస్: పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడడంలో జీవవైవిధ్యం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అంతరించి పోతున్న జీవవైవిధ్యం భూమిని వినాశనం వైపు నడిపిస్తోంది. పెరుగుతున్న మానవ జనాభా, అటవీ నిర్మూలన, వేటాడటం, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా అనేక జాతుల వృక్షజాలం, జంతుజాలం అంతరించిపోతున్నాయి. అందువల్ల, జీవవైవిధ్యంపైపొంచి ఉన్న ముప్పు మానవ ఉనికికి కూడా ప్రమాదకరం. ఈ తరుణంలో తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నాయనేవార్త అందరినీ కలవరానికి గురి చేస్తోంది. జీవవైవిధ్యానికి తేనెటీగలకు అవినాభావ సంబంధం ఉంది. భూమి మీద ఉన్న 90 శాతానికిపైగా పంటలు, వృక్షాలు తేనెటీగల పైనే ఆధారపడి ఉన్నాయి. తేనెటీగలు పూర్తిగా అంతరించి పోతే భూమి మీద ఉన్న జీవులన్నీ కేవలం 30 రోజుల్లోనే చనిపోతాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న తేనెటీగలు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి.
తేనెటీగలు అధిక సంఖ్యలో మరణిస్తే:
దీని వల్ల దుష్పరిణామల గురించి తెలుసుకుందాం. తేనెటీగల ప్రాధాన్యంపై ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటిగొప్ప శాస్త్రవే స్త్ర త్త అద్భుతంగా తెలిపారు. తేనెటీగలు భూమి మీద అదృశ్యమైతే, మనిషికి జీవితం కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తేనెటీగలు లేనప్పుడు, పరాగసంపర్కం ఉండదు. ఫలితంగా మొక్కలు, జంతువులు, మానవులు మనుగడ సాగించలేరు అని వెల్లడించారు. తేనెటీగలు 70 శాతం పంటలను పరాగసంపర్కం చేస్తాయి. తేనెటీగల పరాగసంపర్కం నుంచే మనం వినియోగించే ఆహారంలో మూడింట ఒక వంతు లభిస్తుంది. తేనె టీగలు లేక పోతే, మూడు నెలల్లోపు పంట దిగుబడి ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతుంది. ఆహారం దొరకదు. తక్కువ వైవిధ్యమైన, తక్కువ పోషకాలతో కూడిన ఆహారం మాత్రం ఉంటుంది. పోషకాహార లోపం ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. తేనెటీగల సంరక్షణకు అన్ని దేశాలూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి ఇటీవల కోరింది. దీంతో వీటి ప్రాధాన్యత ఎంత ఉందో అర్ధం అవుతోంది. ముఖ్యంగా పంటల సాగులో ఎక్కువ మొత్తంలో రసాయనిక క్రిమి సంహారక పురుగుల మందులు వాడుతుండడంతో తేనె టీగలు మరణిస్తున్నాయని పలు అధ్యయనాలలో తేలింది. ఇది మరింత ఎక్కువ స్థాయిలో ఉంటేమరిన్ని అనర్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తేనెటీగల రక్షణకు చర్యలు అవసరం:
ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని.. ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగుల మందులు వాడకాన్ని తగ్గించడం ఒకటే పరిష్కారమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాటి ఆవాసాలను రక్షించడానికి, ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది.