అనన్య న్యూస్, మహబూబ్ నగర్: కరోనా సమయంలో అందరూ భయపడి ఇళ్లల్లో ఉంటే రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఎంతో కష్టపడి ప్రజలకు సేవలు అందించడం గొప్ప విషయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా సమయంలో నిరంతరం ప్రజల మధ్యే ఉండి రెడ్ క్రాస్ వారు సేవలు అందించారని అన్నారు. మంగళవారం రెడ్ క్రాస్ జాతీయ కార్యాలయం నుంచి నూతనంగా మహబూబ్ నగర్ శాఖకు వచ్చిన సుమారు రూ. 15 లక్షలకు పైగా విలువైన బ్లడ్ బ్యాంక్ పరికరాలను మంత్రి ప్రారంభించారు. బ్లడ్ బ్యాగ్స్, రిఫ్రిజిరేటర్, ఎలిసా రీడర్, ఎలిసా వాషర్, రెండు డోనర్ కోచ్‌లు, రక్త సంచుల నాలుగు ట్రాన్స్ పోర్ట్ ఐస్ బ్యాగ్స్ ను మంత్రి పరిశీలించారు. రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు నిత్యం అదే స్థాయిలో సేవలు కొనసాగాలన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో విశేషమైన సేవలు అందించినందుకు రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించిన రెడ్ క్రాస్ కార్యవర్గాన్ని మంత్రి అభినందించి వారికి బంగారు పతకాలను అందించారు. మన్యంకొండ బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్భుతమైన సేవలు అందించిన ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాళాశాలకు చెందిన రెడ్ క్రాస్ యూత్ సభ్యులను మంత్రి ప్రశంసాపత్రాలను అందించి అభినందించారు. వారికి భవిష్యత్తులో స్థానికంగానే చక్కని ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి లు రెడ్ క్రాస్ సభ్యుల నుంచి బంగారు పతకం, మొమెంటో, సర్టిఫికెట్ లను అందుకున్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, వైస్ చైర్మన్ డా. శ్యామ్యూల్, కోశాధికారి జగపతిరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బెక్కెం జనార్దన్, కమిటీ సభ్యుడు రమణయ్య, ఆర్ అండ్ బీ డీఈ సంధ్య తదితరులు పాల్గొన్నారు.