హైదరాబాద్, అనన్య న్యూస్: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ గురువారం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరేంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. 17న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. 18న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
పలుచోట్ల వడ గళ్ళ వాన
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తున్నది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేటలో జల్లులు వర్షంపడుతున్నది. చేవేళ్ల నియోజకవర్గంలో ఈదురు గాలులు, సంగారెడ్డి సిల్లా సంగారెడ్డి మండలంలో వడగళ్ల వాన, బడంపేట, మనియార్‌పల్లిలో ఈదురు గాలులతో వర్షం కురుస్తున్నది.