అనన్య న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఇందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేస్తే అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మహబూబ్ నగర్ జిల్లా తాగునీటికి, విద్యుత్తుకు ఇతర అనేక సమస్యలతో సతమతమయ్యేదని, నిధులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఎన్నో ఆదర్శ గ్రామాలుగా రాష్ట్రస్థాయిలో నిలిచాయని, తాగునీటికి, విద్యుత్తుకు ఎలాంటి కొరతలేదని, అన్ని సమస్యలను తీర్చడం జరిగిందని అన్నారు. అభివృద్ధి ఫలాలన్నీ పల్లెలకు అందుతున్నాయని, తాగునీరు, విద్యుత్ సమస్యలను తీర్చడమే కాకుండా, ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రత్యేకించి ఎస్సీ ,ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలను అన్ని మండలాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలోనే జిల్లాలోని అన్ని మండలాల సాగునీరు అందిస్తామని, వలసలకు తావు లేకుండా ఇక్కడే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదండాపూర్ రిజర్వాయర్ లో భాగంగా టన్నెల్ పనులు పూర్తయ్యాయని, కాల్వ పనులు పూర్తయితే సాగునీరు వస్తుందని అన్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా వరద నీటిని రెండు నెలలు కోయిల్ సాగర్ నింపేలాగా ఇదివరకు చేస్తున్నామని, అయితే గ్రావిటీ కెనాల్ ద్వారా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి కోయిల్ సాగర్ ను నింపడంతోపాటు, జూరాల ప్రాజెక్టును కూడా రివర్స్ లో పంపింగ్ చేసే విధంగా ముఖ్యమంత్రి దూరదృష్టతో ఆలోచించారని వెల్లడించారు. జిల్లాలు చిన్నగా కావడం, పరిధి తక్కువ కావడం, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ వల్ల శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్పీ సీఈవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.