- అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు
అనన్య న్యూస్, జడ్చర్ల: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొనియాడారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఆత్మ గౌరవంతో బతకాలని దళిత బంధు తీసుకొచ్చారని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. దళిత బంధు లబ్ధిదారులు నేడు గౌరవంగా ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలని పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.
హైదరాబాద్ లో ఆవిష్కరించనున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే ఎక్కడ లేదన్నారు. కులమతాల పేరుతో చిచ్చు పెట్టే వారి మాయలో పడొద్దని, అందరు కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం పట్టణంలోని పాత బజార్ తో పాటు పలు కూడలల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.