అనన్య న్యూస్, రాజాపూర్: రాజాపూర్ మండలంలోని బీబీనగర్ శివారులోని పెరుమళ్లగుండు దగ్గర బండరాయితో మోది మహిళను దారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్నది. జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప తెలిపిన వివరాల మేరకు.. బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామానికి చెందిన మంజుల (36) గుర్తు తెలియని వ్యక్తులు రాజాపూర్ మండలం బీబీనగర్ శివారులో ఓ వెంచర్‌లో బండరాయితో మోది దారుణ హత్యచేసినట్లు తెలిపారు. శుక్రవారం అటుగా వెళ్తున్న గ్రామస్తులు మహిళ మృతదేహాన్ని చూసి రాజాపూర్ పోలీసులకు సమాచారం అందించగా, విషయం తెలుసుకున్న జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప, రాజాపూర్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
మృతురాలు పెద్దరేవల్లి గ్రామానికి చెందిన మంజులకు మల్లెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని, అతనిని వదిలిపెట్టి గత 10 సంవత్సరాలుగా పెద్దరేవల్లి గ్రామంలో కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తితో పాటు మృతురాలు మంజుల శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో గ్రామం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, దాంతో మంజులను హతమార్చి ఉండొచ్చని తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధం కారణంగానే జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పోలీసులు లోతు గా విచారణ చేపడితేగాని హత్య కు గల కారణాలు తెలిసే అవకాశం ఉన్నాయి. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్ర భుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు. ఈ విషయమై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ జమ్ములప్ప తెలిపారు.