అనన్య న్యూస్, మహబూబ్ నగర్: రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని, అదానీ, మోదీల ఆర్థిక సంబంధాలపై ప్రశ్నిస్తున్నందుకే ఎంపీ సభ్యత్వానికి అనర్హత వేటు వేశారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్. సంపత్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదుట డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ సంకల్ప సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారన్నారు. దేశంలోని ప్రజాసంపదను కొల్లగొడుతున్న విషయాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పదే పదే ప్రశ్నిస్తుండడం వల్ల ఆయనపై కక్షగట్టి అనర్హత వేటు వేశారని విమర్శించారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ భయపడదని, న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర వల్ల ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, దీనిని చూసి భయపడిన బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసిందన్నారు. దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. నిరాహార దీక్షలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ప్రధాన కార్యదర్శులు ఎస్.వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, ప్రదీప్ గౌడ్, నాయకులు జహీర్ అఖ్తర్, వసంత, బెక్కరి అనిత, సీజే బెనహర్, సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, లక్ష్మీనారాయణ, అవేజ్. చంద్రశేఖర్ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.