అనన్య న్యూస్, జడ్చర్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చు పాదయాత్ర చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేత కెవిపి రామచందర్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుక్కంపల్లి వద్ద ఆగి విరామం తీసుకుంటున్న బట్టి విక్రమార్కను కెవిపి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో పీపుల్స్ మార్చు పాదయాత్ర తెలంగాణలో ప్రజాస్వామిక పాలనకు మద్దతు ఇస్తుందని అన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. మోడీ ఆర్థిక విధానాలు పూర్తిగా పేదల బతుకులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. అప్పట్లో రైతుల ఆత్మహత్యలకు నిరసనగా వైఎస్సార్ పాదయాత్ర చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, దీన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం శుభ పరిణామమని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు